వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



12, నవంబర్ 2009, గురువారం

సమస్యలకు చావు పరిష్కారం కాదు.



జీవరాశులన్నిటిలోను ఉత్తమైనది మానవ జన్మ. మనిషిగా జన్మించడం ఒక వరం. జీవులలో అనేకరకాలున్నాయి. పక్షులు, జంతువులు, మానవులు, పక్షిజాతికి, జంతుజాతికి లేని గుణాలు మనష్యజాతిలో వున్నాయి. మనిషి గొప్ప జ్ఞాని. సమాజ స్వరూపాన్ని అవగాహన చేసుకోగలడు. సమాజం ఎందుకిలా అవుతోందని ఆలోచించగలడు. సాటి మనుషులను ప్రేమించగలడు. అప్యాయతని, అనురాగాన్ని పంచివ్వగలడు. తనకు ఏది కావాలో అడగగలడు. తను ఏ మార్గంలో నడవాలో తెలుసుకోగలడు. సాటి మనిషికి సాయంచెయ్యగలడు. అందమైన శిల్పాల్ని చెక్కగలడు. చక్కని బొమ్మలు వేయగలడు. పదిమంది మెచ్చుకునేలా నటించగలడు. ఉన్నత చదువులు చదవగలడు. మానవుడు తన మేథస్సును ఉపయోగించి భావితరాల కోసం ఎన్నో కనిపెట్టాడు. ఆది మానవుని స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన వాడు. రేడియో, టెలిఫోన్‌, విమానం, రైలు, బస్‌, రాకెట్‌ వంటి ఎన్నో సాధనాలు మనకి అందుబాటులోకివచ్చాయి. మానవుడు చంద్రమండలంలో కాలు మోపాడు. అంతరిక్షంలోకి వెళ్ళాడు. కాలాన్ని బట్టి మనిషిలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. ఒకప్పుడు మనిషి ఏది ఆలోచించినా సమాజం గురించి ఆలోచించేవాడు. పదిమంది బాగుండాలని కోరుకునేవాడు. ఉమ్మడి కుటుంబాలు వుండేవి. ఉమ్మడికుటుంబ వ్యవస్థలో మమతా నురాగాలుండేవి, ఆప్యాయతాను బంధాలు వుండేవి. మనుషుల మధ్య ప్రేమాభిమానాలు వుండేవి. అయితే కాలక్రమేణా మనుషులలో స్వార్థం పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయింది. మనిషి మేధస్సు పెరిగే కొద్దీ పతనం ప్రారంభమ యింది. కంప్యూటర్‌లు వచ్చాయి. టైపు మెషిన్‌లు మూలపడ్డాయి, యంత్రాలు వచ్చాయి, కార్మికులు నిరుద్యోగులుగా మిగిలారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంగ్లీషు భాషపై మోజు దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుభాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులులో తమ పిల్లలు మమ్మీ, డాడీ అనిపిలిస్తే ఆనందపడాలనే తపన మొదలయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తల్లిదండ్రులు తయారయ్యారు. తమ స్థాయిని మించి అప్పులు చేసి తమ పిల్లలను ఇంగ్లీషు కాన్వెంట్‌లలోను, రెసిడెన్షియల్‌ కళాశాలలకు పంపిస్తున్నారు. వీళ్ళ బలహీనతలను కనిపెట్టిన కార్పోరేట్‌ యాజమాన్యం ఫీజులను విపరీతంగా పెంచేసింది. ప్రాధమిక స్థాయిలోనే వేలాది రూపాయలు ఫీజుల పేరుతోను, డొనేషన్‌ల పేరుతోను వసూలు చేస్తూ కోట్లకి పడగలెత్తుతున్నారు. 24 గంటలు పిల్లల్ని యంత్రాలుగా తయారు చేస్తూ వాళ్ళ అభిరులు తెలుసుకోకుండా, తమ ఇష్టాన్ని వాళ్ళ నెత్తిన రుద్దుతున్నారు. ఎంతసేపూ తమ పిల్లలు డాక్టర్‌లు కావాలనో, ఇంజనీర్లు కావాలనో ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోరంగం గురించిన ఆలోచనకాని, పిల్లలకి అభిరుచులు వుంటాయని వాళ్ళుకోరుకున్న విధంగా వారి అభివృద్ధికి సాయపడదామని కనీస ధర్మాన్ని విస్మరిస్తున్నారు. ఒకప్పుడు భార్యా భర్తలలో భర్త ఒక్కడే చదువుకొని ఉద్యోగంలో వుంటే భార్య ఇంట్లో వుండి ఇంటిని చక్కదిద్దడంతో పాటు పిల్లల బాధ్యత కూడా తీసుకుని పిల్లల అభిరుచికి తగినట్లుగా వాళ్ళని ఆయా రంగాలలో ఉన్నత స్థాయికి ఎదగడంలో తమవంతు సహకారం అందించేవారు. కాని తరాలు మారుతున్నకొద్దీ భార్యా భర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కాని కుటుంబం గడవని పరిస్థితులు రావటంతో ఖచ్చితంగా చదువుకుని ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటేనే ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఇద్దరు ఉద్యోగస్థులుగా మారటంలో పెద్దవాళ్ళు అండలేకపోవటంతో పిల్లలు బాధ్యత ఇతరుల మీద పెట్టటం ఒక కారణమయితే మూడో ఏడు రాగానే వాళ్ళని కాన్వెంట్‌లకి పంపటం, అక్కడ కనీసం 10తరగతి కూడా పాసవని టీచర్లు పిల్లలకి పాఠాలు బోధించడం, 24 గంటలు హోంవర్క్‌, ఎదిగీ ఎదగని వయసులో పుస్తకాలు బట్టియం పెట్టటం వలన వాళ్ళు ఒక విధమైన మానసిక సంఘర్షణలకు లోనవుతారు. చదువులో కూడా తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలని తమపై రుద్దటం వలన వత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వాళ్ళయొక్క ఆలోచనలు పక్కదారి పట్టె ప్రమాదం వుంది. అదే గాక పుట్టిన ఊరుని, తల్లిదండ్రులని వదిలి ఎక్కడో ఊరుకాని ఊరిలో కళాశాల హాస్టల్‌లో వుండటం తెల్లవారు ఝాము నాలుగు గంటల నుండి రాత్రి 12 గంటల దాకా విద్య పేరుతో పిల్లల్ని యంత్రాలుగా మారుస్తున్న విద్యావ్యవస్థలు ఒక విధమైన 'జైలు'లా స్వేచ్ఛ కోల్పోతున్నట్లుగా బాధపడతారు. ఎవరికి వారు ఏకాకిలాగ బ్రతుకుతున్నామనుకుంటు తమ కెవరు లేరని ఒక డిప్రెషన్‌లో వుండిపోయి, సమవిద్యార్థులు పలకరించినా ముభావంగా వుంటూ ఏదో ఆలోచనలో గడుపుతుంటారు. ఒంటరితనం ఫీలింగ్‌, ఇష్టంలేని చదువు, లెక్చరర్ల వత్తిడి వెరసి జీవితం మీద విరక్తికి లోనవుతారు. లోనయిన క్షణం వారి మెదడు ఆత్మహత్యకి పురికొల్పుతుంది. ఇక ఆడపిల్లల ఆత్మహత్యలు, ఎక్కువగా పెళ్ళయిన ఆడవాళ్ళు మాత్రమే ఈ ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. దీనిలో ఎక్కువ కేసులు కట్నాలవే ఉంటాయి. ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఫారిన్‌ సంబంధాల పై మోజు చూపటం, ఎంత కట్నం ఇస్తే అంత స్టేటస్‌ పెరుగుతంది, పదిమందిలో కూడా గర్వంగా వుంటుందని అప్పుచేసయినా తీసుకువచ్చి లక్షలు ధారపోయటం, సదరు పెళ్ళికొడుకు అప్పటికే అమెరికాలో ఒక పెళ్ళచేసుకుని పిల్లల్ని కూడా కని డబ్బు మీద యావతో మరో పెళ్ళికి సిద్ధపడ్డ ఆ పెళ్ళి కొడుకు వారి బండారం నెమ్మది మీద బయట పడుతుంది. దాంతో సదరు పెళ్ళి కూతురు ఎదురు తిరుగుతుంది. నిర్వాకం బయట పడ్డాక ఇంక హింస మొదలవుతుంది. పెళ్ళి కొడుక్కి ఉద్యోగం, సద్యోగం ఉండదు కాబట్టి కట్నం రూపంలో వచ్చిన ధనం హరించుకుపోతుంది. డబ్బు కోసమే పెళ్ళాడిన ఆ మానవ మృగం డబ్బుకోసం పెళ్ళాన్ని ఇండియా పంపుతాడు. అల్లుడి గారి అసలు రంగు బయటపడినా నిస్సహాయులైన తల్లిదండ్రులు బ్రతుకులు రాజిపడమని అల్లుడు గారు అడిగిన డబ్బు ఇచ్చిపంపుతారు. అడకత్తెరలో ఆ పిల్లబ్రతుకు చివరికి ఆవేదనతో ఇటు కట్టుకున్నవాడి ఆదరణలేక, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతుంది. చిరవకు ఆత్మహత్యకు శరణ్యమనుకుంటుంది. విదేశీ మోజులో తల్లిదండ్రులు వున్నంతవరకు ఆడపిల్లల జీవితాలు ఇంతే! అయితే దగాపడ్డ ఆడపిల్లలు ఆలోచించాల్సింది 'ఆత్మహత్య' చేసుకోవాలనికాదు. బ్రతుకు మీద 'ఆశ' కల్పించుకోవాలి. ఏం మృగం లాంటి ఆ పశువుల అండలేకుంటే బ్రతుకలేరా! మనోనిబ్బరం అలవర్చుకుని బేలతనానికి స్వస్థి చెప్పండి! ధైర్యంతో ముందడుగు వేయండి. మీరు చదువుకున్నారు. మీ కాళ్ళ మీద నిలబడగల సత్తామీకుంది. మీ చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది. ఆ విధంగా మీ జీవితాన్ని తీర్చి దిద్దుకోండి! మీతో పాటు పదిమందికి ఉపాధి కల్పించండి! దగా పడిన ఆడపిల్లలను ఆదరించండి. అక్కున చేర్చుకుని ఓదార్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. అత్యాచారానికి గురవుతున్న ఆడ పిల్లలు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకునే దిశగా అడుగులు వేయండి! కరాటే వంటి విద్యలు ఎన్నో వున్నాయి. వాటిని పట్టుదలతో నేర్చుకోండి! కాంమాంధులను ఏరిపారేయండి. ఆడపిల్ల అంటే అబల కాదు అవసరమైతే ఆది శక్తి కాగలదు అని నిరూపించిండి! అంతేగాని చావు పరిష్కారం కాదు. అసలు బాధల వల్ల చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటే ఈ దేశంలో 90 శాతం మంది ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇక ఆర్థిక బాధలలో కుటుంబంలోని అందరు ఆత్మహత్యలకు పాల్పడటం అంతులేని విషాదం.
ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు గుండె బరువెక్కుతుంది. అసలు ఎటుపోతున్నాం మనం. సమాజంలోని బ్రతుకున్నామా! వ్యాపారంలో నష్టం వస్తేనో, అప్పుల పాలయితేనో.. ఇక ఆత్మహత్యలేనా! బ్రతుకటానికి దారిలేదా! కుటుంబ పెద్ద అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరాశకు లోనయినపుడు ఆ ఇల్లాలు అతనికి ధైర్యం చెప్పాలి. నష్టాల నుండి బయటపడి మార్గాన్ని చూపించాలి. సమస్యలకు చావు పరిష్కారం ఎప్పటికి కాదు. కాలానికి ఎదురించండి! పోరాడండి! విజయం సాధించండి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి