వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



7, సెప్టెంబర్ 2009, సోమవారం

విచిత్ర గ్రామము


భూమాత ఒడిలో అందంగా నెలకొని వుంది, ఓ చిన్న కొండ. ఆ కొండ శిఖరం మీదుంది ఓ చిన్న గ్రామం. దాని పేరు మలైయూర్. ఈ గ్రామానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ చోటికి దోమలు వెళ్లవు. ఈ ఊరి మీదుగా కనీసం కాకులు ఎగరవు. పాములు మొదలుకొని చీమల వరకూ ఏ కీటకం కరిచినా అక్కడి జనానికి విషం సైతం ఎక్కదంటే విడ్డూరంగా అనిపిస్తూంది కదూ?
ఆ ఊరి జనం చెప్పులు వేసుకోరు. వేసుకోకూడదనే నిషేధం వుంది. బహిష్టులో వుండే మహిళలు, గ్రామానికి వెనుకగా దూరంగా వుండే చోట ఏడు రోజుల పాటు, ఎవరి కంటా పడకుండా వుండాలి. అక్కడివారెవరూ ధూమ, మద్యపానాలు చేయరు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు నిషేధం... ఇట్లా పలు రకాలైన కఠిన మైన కట్టుబాట్ల మధ్య జీవిస్తున్నారక్కడి వారు.
దిండుక్కల్ జిల్లాలోని చిరుమలై (చిన్న కొండ) దగ్గరి నుంచి నత్తం, అలంగానల్లూర్‌ల రోడ్డు మీద నాలుగు కిలో మీటర్ల దూరంలో మధ్యగా వుంటుంది మలైయూర్. ఈ గ్రామం లో 175 కుటుంబాలు వసిస్తున్నాయి. చుట్టుపక్కలంతా కొండ దారులే. తెలియనివారెవరైనా గ్రామం లోపలికి పోబోతుంటే, ''ఎవరయ్యా వారు? చెప్పులు విప్పి చేత్తో పట్టుకుని ముందుకు సాగండి. లేకపోతే కన్నమారు స్వామి కోపగిస్తారు'' అంటూ హెచ్చరిస్తారు, అక్కడి పొలాల్లో పనులు చేసుకుంటున్నవారు. చెట్ల మధ్యగా ఏర్పడిన ఇళ్లలోని వారు, బయటి నుంచి వచ్చినవారికి తగిన ఉపచారాలు చేసి, వారి ప్రయాణం బడలికను తీరుస్తుంటారు. ఆహారపు ఏర్పాట్లను కూడా చేసి, కాలక్షేపానికి తమ గ్రామచరిత్రను చెబుతారు. ''ఆ రోజుల్లో మా గ్రామప్రజలు చాలా సంతోషంగా, తగిన వసతులతో హాయిగా జీవించేవారు. దీచ్చాడి గోవిందన్ అనే దోపిడి దొంగ ఈ ప్రాంతాన్ని తరచూ కొల్లగొట్టాలని పథకాలు వేస్తుండేవాడు. కానీ జనం మాత్రం తాము నమ్ముకున్న వీరడి కరుప్పుసామి (వారి ఇష్టదైవం) తమకు రక్షకుడుగా కావలి వుండగా, తమకే విధమైన భయమూ లేదని అనుకునేవారు. అయినప్పటికీ, ఒక రోజున ఆ దోపిడి దొంగ గ్రామంలోకి వచ్చేసి కొల్లగొట్టటమే కాకుండా, ఆరేడుగురిని చంపేసి మరి పోయాడు. బెదిరిపోయిన జనం, క్రమక్రమంగా ఒక్కొక్కరే తమ కుటుంబాలతో ఆ ఊరి నుంచి బయటికి పోవటం ప్రారంభించారు.
''దరిద్రం అంతటా తాండవిస్తూ వుంటే తినేందుకు ఏమీ దొరికేది కాదు. ఓ రోజున, ఒహాయన, అడవిలోని దుంపలను తవ్వుతుండగా, అతని ముందు కరుప్పుసామి ప్రత్యక్షమయ్యాడు. ''ఒరేయ్, ఎవరూ ఊరొదిలి పోవద్దు. నేనే అందరికీ కావలిగా వుంటాను. భయపడకుండా ఇక్కడే వుండండి'' అని ఆనతిచ్చాడు. ఆ పెద్దాయన వెంటనే తమకు కావలసింది ఏర్పాటు చేయమని స్వామిని అడిగాడు. ఏమడిగాడో తెలుసా? 'ఈ గ్రామంలో దోమలు విపరీతంగా వున్నాయి. కొండ మీద పనులు చేసుకుని వచ్చి అలసిపోయినవారు నిద్ర పోదామంటే ఈ దోమల సంగీతం భరించలేరు. అందుకని, ఈ ఊళ్లోకి దోమలు రాకూడదు. గర్భిణులు ప్రసవాల కోసం కొండ దిగి వచ్చేందుకు చాలా కష్టపడతారు. అందుకని వారి సుఖప్రసవాలు ఇక్కడే జరిగేలా చేయి. ఈ ప్రాంతంలో పాముల వంటి విషజంతువులు అధికంగా తిరుగుతుంటాయి. అవి కాటు వేసినా విషం ఎక్కకుండా వరమీయి. అంతే కాదు, నీకు ఉత్సవాలు జరిపే ఆషాఢమాసంలో నీవు కాకి రూపంలో వచ్చి మాకు దర్శనమీయాలి. ఈ ఊళ్లోని ప్రతి అణువునా నీవే వున్నావని విశ్వసించి మేమీ ఊరినే ఓ ఆలయంలా భావిస్తున్నాము. అందుచేత ఈ ఊళ్లోకి మేమెవరమూ చెప్పులు వేసుకుని రాము' అన్నాట్ట. అలా మాట కూడా ఇచ్చేశాడు'' అంటూ కరుప్పయ్య అనే వ్యక్తి, తమ పూర్వికులు ఏర్పాటు చేసిన పద్ధతులను సవివరంగా చెబుతాడు.
''ఆషాఢమాసంలో కన్నిమారు సామికీ, కరుప్పయ్య సామికీ ఉత్సవాలు చేస్తాం. ఆషాఢమాసం తొలి రోజు నుంచి ఉత్సవాలు నిర్ణయించే రోజు వరకూ రెండే రెండు కాకులు, మా గ్రామంలోకి ఎగురుతూ వచ్చి, వుంటాయి. తారీఖు నిర్ణయించి వాటికి పండ్లను నైవేద్యంగా పెడితే, ఆరగించి వెళ్లిపోతాయి. మళ్లీ మరుసటి ఏడాది అదే రోజున వస్తాయి. మా ఇళ్లను సైతం భగవంతుని ఆలయాలుగా భావించటం చేత, బహిష్టులో వుండే స్త్రీలందరినీ ఊరికి దూరంగా ఏడు రోజుల పాటు వుంచుతాము. వారికి తినేందుకు విడిగా పళ్లాలు ఇవ్వటంతో పాటు, ఆ చుట్టుపక్కలకు ఎవరినీ పోనీయం. ఏ విషకీటకం కుట్టినా విషం ఎక్కదు. బయటివారెవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కుడితే, ఆరు రూపాయల పావలా స్వామికి కానుకగా చెల్లించాలి. పక్కనే ఊరుతున్న జల నుంచి నీటిని తీర్థంగా ఇస్తాము. అది తాగితే విషం ఎక్కదు. ఊళ్లో వుండే బావుల్లో కాళ్లు కడగటమో, స్నానాలో చేయకూడదు. కేవలం తాగేందుకే వాడుకోవాలి. ఇటీవల బావిలో మరమ్మత్తు కార్యక్రమాలు సాగాయి. అలా మరమ్మతులు చేస్తున్నప్పుడు, తమ కాళ్లు బావిలోని నీటికి తగిలాయని, వారు పనులు జరిగినంత కాలమూ రోజూ, ఆరుంబావలా రూపాయలు స్వామికి కానుకలుగా అర్పించుకున్నారు'' అంటూ మరో భక్తుడు పారవశ్యంతో చెబుతాడు.
తమ ఈ గ్రామానికి కాలి బాటలు కావాలని పోరాడుతున్నారు జనం. ''కొండ మీదికి ఎక్కాలి. మామూలుగా నడిచేందుకే వీలుండదు. ఇక బరువులు కూడా మోసుకెళ్లాలి కదా. కొండ దారులన్నిటినీ శుభ్రం చేసేందుకు పూనుకుంటే, ఇక్కడి ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డు పడుతున్నారు'' అంటూ అక్కడి సమస్యలను వచ్చినవారికి చెప్పుకుంటారు. కొండ మీదికి సరకులు తెచ్చేందుకు రెండేళ్లుగా ఏడు గుర్రాలను వాడుకుంటున్నారు. ఏ సరకులనైనా సరే పైకి చేర్చేందుకూ, కిందికి దించేందుకూ తలకు వంద రూపాయలు రుసుము. ఇటువంటి కష్టాలున్నప్పటికీ, వారు మాత్రం ఆ గ్రామాన్ని విడిచి వచ్చేందుకు అంగీకరించటం లేదు.
''ఐదో తరగతి వరకూ బడి వుంది. పై చదువులకు బయటి ఊరికి వెళ్లాలి. కొండ దిగేందుకూ, ఎక్కేందుకూ నాలుగు గంటల సమయం పడుతుంది. అంత శ్రమా పడుతూనే మా వాళ్లంతా చదువుకుంటున్నారు'' అంటూ ఆ గ్రామంలోని బడి ముఖ్య ఉపాధ్యాయుడు అమలదాస్ బాధ పడుతున్నారు. ''రోజూ కొండ మీదికి ఎక్కి రావాలంటే నాకూ శ్రమగానే వుంటుంది. అయినా, ఎందుకో ఈ జనాన్నీ, గ్రామాన్నీ విడిచి వెళ్లాలంటే మనస్కరించటం లేదు'' అంటూ, తన మదిలోని ఆప్యాయతను వెలిబుచ్చుతారాయన.
ఇక, ఈ గ్రామంలో దోమలు లేకపోవటానికీ కారణాలున్నాయి.
''నిజానికి, కొండ ప్రాంతాల్లో కాకులూ, దోమలు వుండటం చాలా తక్కువే. కాకులకు సాధారణంగా పాడైన జంతువుల దేహాలూ,పండ్లే ఆహారం. అవి, ఈ కొండ ప్రాం తాల్లో లభించటం తక్కువే. కొండ ప్రాంతాల్లో సూర్యరశ్మి తక్కువగా ప్రసరించటం చేతనూ, ఋతువులు త్వరగా మారిపోవటం వల్లనూ, దోమలుండవు. మామూలుగా అన్ని కొండ ప్రాంతాల్లోనూ కాకులూ, దోమలూ సహజంగానే తక్కువగా పారాడుతాయి. "






1 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలియచేశారు !!

కామెంట్‌ను పోస్ట్ చేయండి