6, సెప్టెంబర్ 2009, ఆదివారం
ఈ వివక్షను ఏమంటారు ?
భారత దేశంలో కులం పేరుతో, మతం పేరుతో సాగుతున్న కక్షలు కార్పణ్యాలు, దాడులు మానవ నాగరికత పాలిట శాపంగా మారాయి. భిన్న జాతులు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన దేశంలో కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు నడపడం వల్లే ఈ సామాజిక వివక్ష ఇంతగా వేళ్ళూనుకుపోయింది. ఆస్ట్రేలియాలో భారతీయులపై శ్వేత జాతీయులు ప్రదర్శిస్తున్న జాత్యహంకారం ఎంత దుర్మార్గమైనదో మన దేశంలో కులం పేరుతో, మతం పేరుతో సాగుతున్న వివక్షకూడా అంతే నీచమైనది. జాత్యహంకారాన్ని ఖండించేవారు ఇక్కడ తాము జరుపుతున్న కుల తత్వ, మతతత్వ రాజకీయాల గురించి మౌనం పాటించడం ద్వంద్వ ప్రమాణం కాదా? జాత్యహంకారం కన్నా కుల వివక్ష తక్కువేమీ కాదు. హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, యుపి, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కులం పేరుతో సాగుతున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే మతం పేరుతో గుజరాత్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక అమానుషాలు సాగుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 14- 18 అధికరణలు సమానత్వ హక్కును ప్రతి పౌరునికీ ప్రసాదించాయి. దురదృష్ట వశాత్తు అవి కాగితాలకే పరిమితమయ్యాయి. జాతి, సంస్కృతుల గురించి వాగాడంబరాన్ని ప్రదర్శించే ఆరెస్సెస్ వంటి సంస్థల చర్యలు అగ్రవర్ణాధిపత్యాన్ని సంరక్షించేందుకే తోడ్పడుతున్నాయి. హిందువుగా పుట్టు, హిందువుగానే మరణించు అని ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు గోడల మీద పెద్ద రాతలు రాస్తుంటాయి. మత మార్పిడులు నేరం, ఘోరం అన్నట్లుగా మాట్లాడతాయి. అంతే కానీ, హిందూ మతంలో ఉన్న దారుణమైన కుల వివక్ష గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడవు. అలాగే శిక్కుల్లోనూ, బౌద్ధుల్లోనూ, ముస్లింలలోనూ, క్రైస్తవుల్లోనూ ఈ వివక్ష వుంది. వివక్ష ఎక్కడున్నా ఏ రూపంలో వున్నా తిరస్కరించాల్సిందే.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి