వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



31, ఆగస్టు 2009, సోమవారం

ఒక్క ఖనిజం కూడా మిగిలే పరిస్థితుల్లేవు


ఇదే వేగంతో దేశ పరిధిలోని నిక్షేపాలన్నింటినీ తవ్వి వినియోగించుకుంటూ పోతే మరో 30ఏళ్ళలో భారత భూభాగంలో ఏ ఒక్క ఖనిజం కూడా మిగిలే పరిస్థితుల్లేవు. భావితరాలకు కేవలం మట్టిని మాత్రమే వారసత్వ సంపదగా మిగిల్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. మన పాలకులకు దీర్ఘకాలిక ప్రణాళికల్లేవు. తమ పదవీ కాల పరిధిలోనే వీలైనంత సాధించాలన్న ఆతృత మాత్రమే వ్యక్తమౌతోంది. సాధారణ ప్రజలు కూడా ఆ రోజుతో పాటు కనీసం వచ్చే వారం వరకైనా ఆహారాన్ని సమకూర్చుకోవాలని ఆశిస్తారు. తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపుదిద్దుతారు. అయితే ప్రస్తుత పాలకులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భూగర్భాన్ని వీలైనంత వేగంగా ఖాళీ చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రయోజనాలు నెరవేరితే చాలని భావిస్తున్నారు. దేశంలోని అతిపెద్దదైన గ్యాస్ ఫ్లీట్ మన కెజి బేసిన్‌లో ఉంది. దేశంలోనే అతిపెద్దదైన కోల్‌ఫ్లీట్ కూడా మన రాష్ట్రంలోనే ఉంది. గోదావరి వాలీగా ప్రసిద్దికెక్కిన తెలంగాణాలోని ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 350కిలోమీటర్ల విస్తీర్ణంలోని బొగ్గు గనుల్లో 9,344మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. 50ఏళ్ళ క్రితమే వీటిని తవ్వి తీయడం ప్రారంభించారు. ప్రతిఏటా 50మిలియన్ టన్నులను వెలికితీస్తూనే ఉన్నారు. ఇంతవరకు దాదాపు 1500మిలియన్ టన్నుల బొగ్గును ఒక్క గోదావరి వాలీలోని సింగరేణి కాలరీస్ నుంచి త్వవ్వి తీసారు. దేశంలోని బొగ్గు నిల్వల్లో దాదాపు 50శాతం ఒక్క గోదావరి వాలీలోనే ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో ప్రతిఏటా కనీసం 104మిలియన్ టన్నుల ఉత్పత్తిని దేశీయంగా సాధించాలని కోల్ ఇండియా లిమిటెడ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండురోజుల క్రితం చైర్మన్ భట్టాచార్య అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి బొగ్గు ఉత్పత్తిదారుల సంఘ వార్షిక సమావేశం కూడా దీన్ని ఆమోదించింది. ప్రతి ఏటా ఉత్పత్తిలో 7శాతం వృద్ది సాధించాలని కూడా నిర్దేశించింది. అయినప్పటికీ కూడా దేశంలో ప్రతిఏటా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో సుమారు 50శాతం మన రాష్ట్రంలోని సింగరేణి నుంచే ఉత్పత్తవుతోంది.
ఇక కెజిబేసిన్‌లోని గ్యాస్ రాబోయే 30ఏళ్ళ పాటు దేశీయ అవసరాలను తీర్చనుంది. సుమారు 30లక్షల కోట్ల విలువైన గ్యాస్ నిల్వలు కెజిబేసిన్‌లో ఉన్నట్లు గుర్తించారు. రిలయన్స్ 34ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను, జిఎస్‌పిసి 20ట్రిలియన్‌ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను, ఒఎన్‌జిసి 10ట్రిలియన్ క్యూబిక్‌మీటర్ల గ్యాస్‌ను గుర్తించాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశీయ నిక్షేపాలను వేగంగా వెలికితీసేందుకు ఆతృత పడటంలేదు. ముఖ్యంగా బొగ్గు, చమురు, గ్యాస్, ఇనుప ఖనిజం వంటి వాటి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. భవిష్యత్‌ను నిర్దేశించగల ఈ భూగర్భ ఖనిజాలను వెనువెంటనే వెలికితీసి వాడేసుకుంటే భవిష్యత్‌లో తమ దేశం ఎందుకూ కొరగాకుండా పోతుందన్న భయాందోళనలు వాటికున్నాయి. రష్యా నుంచి 1867లో కేవలం 7.20మిలియన్ డాలర్లకు అమెరికా కొనుగోలు చేసిన అలస్కా దీవిలో 2,420క్యూబిక్ కిలోమీటర్ల పరిధిలో 85.40ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్, చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. అమెరికా వీటిని గుర్తించి నాణ్యతను పరీక్షించింది. ఆ తర్వాత బావులను మూసేసింది. ప్రస్తుతం ప్రపంచంలో లభిస్తున్న గ్యాస్, చమురు నిక్షేపాలను మరో 30ఏళ్ళ పాటు ఇలాగే వినియోగిస్తే బావులన్నీ ఖాళీ అయిపోతాయి. ప్రపంచదేశాల వద్ద చమురు, గ్యాస్ నిల్వలు పూర్తయిన తర్వాత తమ బావులను తెరవాలని అమెరికా భావిస్తోంది. తమ భావి సమాజానికి ఈ చమురుబావులను వారసత్వ సంపదగా ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. అధికారంలో రిపబ్లికన్‌లున్నా, డెమోక్రాట్‌లు వచ్చినా ఈ విషయంలో మాత్రం వారందరికీ ఒకటే నిర్ణయం. ప్రపంచంలోని నిల్వలన్నీ ఖాళీ అయ్యేవరకు తమ బావులను తెరవకుండా దేశీయంగా లభించే చమురు, గ్యాస్‌లతో పాటు అవసరమైన మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కూడా అమెరికా వెనుకాడటంలేదు. అంతే తప్ప తమవద్దనున్న బావులు మాత్రం తెరవడం లేదు. కెజిబేసిన్‌లో లభించిన గ్యాస్‌ను నిలువరించే అవకాశాల్లేవు. దీని వెలికితీతతోపాటు సరఫరా కూడా మొదలైంది. దేశీయంగా కొన్ని పరిశ్రమలకు ఈ గ్యాస్‌ను కేటాయిస్తున్నారు. గ్యాస్ వెలికితీత జరుగుతున్నందున ఇక బొగ్గు ఉత్పత్తిని కొంతకాలం పాటు వాయిదావేసి బొగ్గు నిల్వలను భావితరాలకు వారసత్వ సంపదగా అందజేసే యోచన మాత్రం ప్రభుత్వానికి కనిపించడంలేదు. బొగ్గును ఇంధనంగా చేసుకుని పని చేస్తున్న కోల్‌ఫ్లీట్ పరిశ్రమలన్నింటినీ గ్యాస్‌ఫ్లీట్ పరిశ్రమలుగా మార్పు చేసి కెజి బేసిన్ గ్యాస్‌ను సరఫరా చేసే అవకాశాలున్నాయి. అలా చేసినా ఇక్కడి గ్యాస్ రాబోయే 30ఏళ్ళ పాటు దేశీయ అవసరాలను తీరుస్తుంది. అయితే లేనిదల్లా నేతల్లో దూరదృష్టే.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి